BSNL: జియో ఫోన్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్ కీలక ఒప్పందం.. సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్

BSNL has partnered with Karbonn Mobiles to launch an exclusive SIM handset phones
  • ఫీచర్ ఫోన్లపై 4జీ కనెక్టివిటీ అందించేందుకు సన్నద్ధం
  • ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్లను అందుబాటులోకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ యోచన 
  • కార్బన్ మొబైల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడా ఐడియా) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్‌ఎల్‌కు ఆదరణ పెరిగింది. ఈ మధ్య కాలంలో చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుండడమే ఇందుకు కారణంగా ఉంది. కాగా 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో ఫీచర్ ఫోన్లను వాడుతున్న కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందడుగు వేసింది.

భారత్ 4జీ విధానానికి అనుగుణంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ ‘కార్బన్ మొబైల్స్’తో జతకట్టినట్టు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్‌ఎల్ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వస్తే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు అవసరం లేకుండానే 4జీ సేవలను పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కీలకమైన ఈ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించింది. 

కార్బన్ మొబైల్స్ తో కలిసి దేశంలో ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ మేరకు కార్బన్ మొబైల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబర్ 1న కీలక ప్రకటన చేసింది. కాగా ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ఫోన్లు జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్లతో పోటీ పడనున్నాయి. సరసమైన ధరల్లోనే హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే అవకాశాలు ఉన్నాయి.
BSNL
BSNL Feature Phones
Karbonn Mobiles
Jio

More Telugu News