Konda Surekha: నా భర్తపై అపనింద వేస్తావా?: కొండా సురేఖపై నాగార్జున భార్య అమల తీవ్ర ఆగ్రహం

Shocked to hear a woman minister turn into a demon
  • ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం ఏమిటన్న అమల
  • నేతలు దిగజారి ప్రవర్తిస్తే దేశం ఏమవుతుంది? అని నిలదీత
  • మా కుటుంబానికి మీ మంత్రి క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల వ్యాఖ్య
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల తీవ్రంగా స్పందించారు. నా భర్తపై అపనింద వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం, కల్పిత చెడు ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వారి రాజకీయ యుద్ధానికి లేదా ప్రయోజనాల కోసం మంచి మనుషులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని రాసుకొచ్చారు.

మేడమ్ మినిస్టర్, మీరు నిజాలు తెలుసుకోకుండా నా భర్తపై అపనిందలు వేశారని మండిపడ్డారు. తన భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న వ్యక్తులను నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? అని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆ తర్వాత రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల ట్వీట్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారూ, మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండని సూచించారు. మీ మంత్రి మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన విషపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి వారి నుంచి ఈ దేశపౌరులను రక్షించాలని కోరారు.
Konda Surekha
Amala
Nagarjuna
Tollywood

More Telugu News