Mahesh Babu: కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేశ్ బాబు ఆగ్రహం
- సినిమా కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధించాయన్న మహేశ్ బాబు
- కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా... ఈ వ్యాఖ్యలు బాధించాయని వ్యాఖ్య
- ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న మహేశ్ బాబు
- ఎదుటివారి మనోభావాలు గాయపడనంతవరకే వాక్ స్వేచ్ఛ ఉంటుందని వెల్లడి
నాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు చెందిన వారిని లాగడం ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య, సమంత, హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున తదితర ప్రముఖులు స్పందించారు.
తాజాగా, నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మా సినిమా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయి అని పేర్కొన్నారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఓ తల్లికి కొడుకుగా... ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర వేదనకు గురిచేశాయని, ఆమె ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఎదుటివారి మనోభావాలను గాయపర్చనంత వరకు మనకు వాక్స్వాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి చవకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని, సినిమా వాళ్లే కదా అని చులకనగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలోని మహిళలను, సినిమా పరిశ్రమ వారిని గౌరవించాలని సూచించారు.