Harbhajan Singh: టీమిండియా మాజీ స్కిప్పర్ ధోనీపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు
- ఆటగాళ్లతో ధోనీ మాట్లాడడన్న హర్భజన్ సింగ్
- రోహిత్ కలుపుకొనిపోతాడని, వారి వ్యూహాలు తెలుసుకుంటాడని పేర్కొన్న మాజీ స్పిన్నర్
- ధోనీతో కంటే రోహిత్‌తోనే ఆటగాళ్లు ఎక్కువగా కలిసిపోతారని వ్యాఖ్య
- రోహిత్ ‘పీపుల్స్ కెప్టెన్’ అని కితాబు
దేశానికి రెండు ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించి పెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ, రోహిత్ ఇద్దరి కెప్టెన్సీలో ఆడిన భజ్జీ.. ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు రోహిత్‌కే ఓటేశాడు.
ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకోగా, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని ఐసీసీ అన్ని ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్లు చెరో ఐదు టైటిళ్లు సాధించాయి.
రోహిత్ బెస్ట్ కెప్టెన్
ధోనీతో పోలిస్తే రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని కితాబునిచ్చిన హర్భజన్‌సింగ్.. రోహిత్ తన ఆటగాళ్లకు చేరువగా ఉంటాడని, ధోనీతో పోలిస్తే ఈ లక్షణాలు అతడిని వేరుగా ఉంచుతాయని ప్రశంసించాడు. ధోనీతో కంటే రోహిత్‌తోనే ఆటగాళ్లు ఎక్కువగా కనెక్ట్ అవుతారని పేర్కొన్నాడు. రోహిత్ తన ఆటగాళ్లతో సన్నిహితంగా మెలుగుతాడని, వారి వ్యూహాలను అర్థం చేసుకుంటాడని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం వంటివి అతడిని ‘పీపుల్స్ కెప్టెన్’గా మార్చాయని కితాబునిచ్చాడు. ఈ విషయంలో ధోనీ కంటే మెరుగని పేర్కొన్నాడు. ‘స్పోర్ట్స్ యారీ’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాళ్లను ధోనీ వదిలేస్తాడు
మైదానంలో ధోనీ కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాడని పేర్కొన్న హర్భజన్.. ఆటగాళ్ల విషయంలో ధోనీ జోక్యం చేసుకోడని విమర్శించాడు. ఆటగాళ్లు తప్పుచేసినా చెప్పడని, ఆ తప్పుల నుంచి వారే నేర్చుకుంటాడని వదిలేస్తాడని చెప్పాడు. ధోనీ మౌనంగా ఉంటూనే తన ఆలోచనలను ఆటగాళ్లకు తెలియజేసేవాడని, సహచరులతో అలానే సంభాషించడం అతడి శైలి అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రోహిత్ ఆటగాళ్లతో కలిసిపోయే విధానం, మాట్లాడే తీరు, వారిలో నమ్మకాన్ని పెంచడం వంటివి ధోనీ కంటే భిన్నంగా నిలబెడతాయని, ఆటగాళ్లలో విశ్వాసాన్ని పెంచుతాయని వివరించాడు.
అందుకే అతడు పీపుల్స్ కెప్టెన్
కెప్టెన్సీ విషయంలో ధోనీ కంటే రోహిత్ ముందున్నాడని పేర్కొన్న మాజీ స్పిన్నర్.. ఆటగాళ్ల ప్రణాళికలు తెలుసుకునేందుకు రోహిత్ వారి వద్దకు వెళ్తాడని, సహచరులతో కలిసిపోతాడని తెలిపాడు. కానీ, ధోనీ మాత్రం అందుకు భిన్నమని పేర్కొన్నాడు. అతడు ఎవరితోనూ మాట్లాడడని, తన మౌనం ద్వారానే ఆటగాళ్లకు తన ఆలోచనలను తెలియజేయాలనుకుంటాడని, సహచరులతో కమ్యూనికేట్ చేయడంలో అతడిది విభిన్న శైలి అని పేర్కొన్నాడు. ఫీల్డర్ ఎక్కడ ఫీల్డింగ్ చేయాలని అనుకుంటున్నాడన్న విషయాన్ని ధోనీ ఎప్పుడూ అడిగి తెలుసుకోలేదని హర్భజన్ వివరించాడు.