Posani Krishna Murali: నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి: పోసాని కృష్ణమురళి
- సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారీ ముందుకు వచ్చానన్న పోసాని
- నాగార్జున కుటుంబంపై దాడిని బాలకృష్ణ కుటుంబం ఖండించలేదన్న పోసాని
- గతంలో తాను పవన్ కల్యాణ్‌ను తిట్టలేదని వివరణ
సమంత, నాగచైతన్య విడాకులు, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. జెంటిల్మన్ నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తనకు ముప్పై ఏళ్లుగా తెలుసునని, ఆమె మంచి మనిషి అని, కానీ నాగార్జునపై ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికీ హానీ చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడటం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌కు పెళ్లయి ముంబైలో ఉంటుందని, ఆమె గురించి మాట్లాడటం సరికాదన్నారు.
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారీ ముందుకు వచ్చానన్నారు. సినీ కళామతల్లి తన కన్నతల్లివంటిదన్నారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటానన్నారు. నాగార్జున కుటుంబంపై జరిగిన ఈ మాటల దాడిని పరిశ్రమలో అందరూ ఖండించారని, కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం స్పందించలేదని విమర్శించారు. ఆడపిల్లలకు కడుపైనా చేయాలి... ముద్దు అయినా పెట్టాలి అన్న బాలకృష్ణ నుంచి మనం క్షమాపణ కోరగలమా? అని ప్రశ్నించారు.
అక్కినేని, కొండా సురేఖ ఘటనను కొంతమంది తనకు ఆపాదించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "గతంలో కొంతమంది పవన్ కల్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు" అంటూ తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌ను తాను తిట్టినట్లు నిరూపిస్తే లైవ్‌లో గొంతు కోసుకొని చనిపోతానని సవాల్ చేశారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాలు తిట్టుకున్నాయని వ్యాఖ్యానించారు.