Tirupati Laddu: మీరు ఏ ఉద్దేశంతో తలుపు తట్టారో సుప్రీంకోర్టుకు అర్థమైంది: జగన్ వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్
- తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
- ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్
- ఐదేళ్లలో ఎప్పుడైనా తిరుమల గురించి మాట్లాడారా అంటూ పయ్యావుల కౌంటర్
- పునాదులు కదిలాయి కాబట్టే తిరుమల గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించగా, వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా ముందుకు వచ్చి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం దాచిపెట్టి వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందన్న విషయం సుప్రీంకోర్టుకు స్పష్టంగా అర్థమైంది... మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారో ధర్మాసనానికి అర్థమైంది అని వ్యాఖ్యానించారు.
"కోర్టు చెప్పింది ఏమిటంటే... తిరుమలనో, వెంకటేశ్వరస్వామినో రాజకీయాలకు వాడుకుంటున్నారని కాదు... మీ రాజకీయ యుద్ధాలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని కోర్టు స్పష్టంగా చెప్పింది. నిజం చెప్పులు వేసుకోకముందే అసత్యం ఊరంతా తిరిగి వచ్చినట్టు... తీర్పు వెలువడిన అరగంటలోనే వక్రీకరించారు.
తీర్పు కాపీ రాకముందే జగన్ గంటన్నర ప్రెస్ మీట్ పెట్టి వక్రభాష్యాలు ఇచ్చి వెళ్లిపోయారు. చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు కానీ... ఐదేళ్లలో ఎప్పుడైనా తిరుమల ప్రాశస్త్యం గురించి మాట్లాడారా...?
తిరుమల వెళ్లడానికి బద్ధకించి తిరుమల వెంకటేశ్వరుడ్నే ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకున్న మహానుభావుడు మీరు. మేం చెప్పేది ఒక్కటే... ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సిట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఒక ఫుడ్ టెక్నాలజీ నిపుణుడు ఉంటారు... వీళ్లందరి పర్యవేక్షణలో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయ్యే సిట్ కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఎందుకంటే... టీటీడీలో ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నదే మేము. ఇందులో దోషి ఎవరన్నది చూపించే సమయం దగ్గరికి వచ్చింది" అని పయ్యావుల స్పష్టం చేశారు.