Maoists Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. ఎన్కౌంటర్లో 36 మంది నక్సల్స్ మృతి.. చరిత్రలోనే అతిపెద్ద ఘటన!
- నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులోని నెందూర్-తుల్తులి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్
- మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఎదురు కాల్పులు
- మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ
- కొనసాగుతున్న కూంబింగ్
మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులోని నెందూర్-తుల్తులి అటవీ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు పెరిగింది. తొలుత ఏడుగురు మృతి చెందినట్టు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 36 వద్దకు వచ్చి ఆగింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.
మావోయిస్టు పార్టీ కాయ్-6కు చెందిన శ్రేణులే మృతి చెందారని, వీరిలో ఆ పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ, అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు (52) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రానికి 14 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకులు వంటి 36 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.