Tirumala: తిరుమల శ్రీవారి ధ్వజస్తంభం కొక్కెంపై అసత్య ప్రచారం.. నమ్మొద్దన్న టీటీడీ
- బ్రహ్మోత్సవాలకు ముందు ధ్వజస్తంభం కొక్కెం మార్చిన అధికారులు
- దీనిని అపచారంగా భావిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం
- తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదన్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంపై సామాజిక మాధ్యమాల్లో మరోమారు అసత్య ప్రచారం జరిగింది. ధ్వజ స్తంభానికి వేలాడదీసే కొక్కెం విరిగిపోయిందని, ఇది అపచారమని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటిదేమీ లేదని, ఇలాంటి వదంతులను భక్తులు నమ్మవద్దని సూచించింది.
బ్రహ్మోత్సవాలకు ముందు సాధారణంగా శ్రీవారి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం ఆనవాయతీ. భిన్నమైన వస్తువులు కనిపిస్తే వాటిని తొలగించి కొత్తవి అమరుస్తారు. అందులో భాగంగానే ధ్వజపటాన్ని ఎగురవేసే కొక్కెం మార్చి దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం జరిగింది. కొక్కెం మార్చడాన్ని అపచారంగా భావిస్తూ కొందరు ప్రచారం చేశారు. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు. ఈ వదంతులు నమ్మొద్దని, తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని పేర్కొన్నారు.