P.SuSheela: ప్రముఖ గాయని సుశీలకు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం
- ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ‘కళైగ్నర్ మెమోరియల్ కళైతురై విఠగర్’ అవార్డు అందుకున్న సుశీల
- ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఇష్టమైన పాటలోని కొన్ని చరణాల ఆలాపన
- సుశీలకు అవార్డు అందించినందుకు గర్వంగా ఉందన్న సీఎం
తమిళ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ప్రముఖ నేపథ్య గాయని పి. సుశీల, ప్రముఖ కవి ము మేథ ‘కళైగ్నర్ మెమోరియల్ కళైతురై విఠగర్’ అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వీరికి అవార్డులు ప్రదానం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న సుశీల అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా 1962లో వచ్చిన ‘దీవతిన్ దీవమ్’ సినిమాలోని స్టాలిన్ ఫేవరెట్ సాంగ్ అయిన ‘నీ ఇల్లథ ఉళగథిలే, నిమ్మథి ఇల్లై’ పాటలోని కొన్ని చరణాలను సుశీల ఆలపించారు. అలాగే, ‘కాగిత ఓడమ్, కడల్ అలై మెలే’, తమిళ్ థాయ్ వళుతు’ పాటల్లోని కొన్ని చరణాలను కూడా ఆలపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా పెదవి కలపడం గమనార్హం.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ గతేడాది డాక్టర్ జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సుశీలను గౌరవించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. సౌత్ ఇండియన్ నైటింగేల్ సుశీలకు అవార్డు అందించినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె తన గాత్రంతో లక్షలమంది అభిమానుల హృదయాలను పరవశింపజేశారని కొనియాడారు. అలాగే, కవి ము మేథా కవితను గుర్తు చేసుకున్నారు.