Chandrababu: తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు: చంద్రబాబు
- తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు
- కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య
- తిరుమల పవిత్రత, నమ్మకాన్ని కాపాడేలా పని చేయాలని సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు. తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని... కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తిగా తిరిగి వెళ్లాలని అన్నారు.
తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా టీటీడీ అధికారులు, సిబ్బంది పని చేయాలని చెప్పారు. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దని అన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళికలు అవసరమని చెప్పారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలని అన్నారు. అడవుల విస్తరణకు, సంరక్షణకు ప్రణాళికతో పని చేయాలని చెప్పారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.