Chiranjeevi: అతడిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు: చిరంజీవి

Chiranjeevi visits Rajendra Prasad and consoled him
  • నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
  • రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం
  • వినకూడని మాట వినడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న చిరంజీవి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర విషాదంలో ఉన్న రాజేంద్రప్రసాద్ కు సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. రాజేంద్రప్రసాద్ నివాసానికి వచ్చి ఓదార్చుతున్నారు. 

అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా కూకట్ పల్లిలోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వచ్చారు. తన మిత్రుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొనడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరినీ నవ్వించే రాజేంద్రప్రసాద్ ను ఎలా ఓదార్చాలో తెలియడంలేదు అంటూ చిరంజీవి భావోద్వేగాలకు లోనయ్యారు. 

"రాజేంద్రప్రసాద్ కుమార్తె హఠాన్మరణం చెందిందన్న వార్తను ఈ ఉదయాన్నే విన్నాను. వినకూడని మాట వినడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇంత బాధను నా మిత్రుడు (రాజేంద్రప్రసాద్) ఎలా భరించగలడు? అనిపించింది. ఆ బిడ్డ చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడడం బాధాకరం. 

రాజేంద్రప్రసాద్ ను కలిసి పరామర్శించాను. "అప్పుడప్పుడు దేవుడు పరీక్షలు పెడుతుంటాడు... అన్నింటినీ స్వీకరించగలగాలి" అని రాజేంద్రప్రసాద్ వేదాంతిలా మాట్లాడుతుంటే ఎంతో వేదన కలిగింది. సగం జీవితం కూడా చూడని చిన్నవాళ్లు ఈ లోకాన్ని వదిలి వెళితే పెద్దవాళ్లకు కలిగే ఆ బాధ వర్ణనాతీతం. 

నా స్నేహితుడు రాజేంద్రప్రసాద్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని, మనందరినీ మళ్లీ నవ్వించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Rajendra Prasad
Daughter
Gayatri
Demise
Hyderabad
Tollywood

More Telugu News