Jio: రూ.1,029 రీఛార్జ్ ప్లాన్‌ని అప్డేట్ చేసిన జియో.. మార్పు ఇదే
- కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ని జోడించిన దేశీయ టెలికం దిగ్గజం
- మొబైల్‌తో పాటు టీవీకి కూడా కనెక్టివిటీ వర్తింపు
- ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి రూ.1029 ఆకర్షణీయమైన ప్లాన్
కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటించే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్డేట్లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను జోడించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్లో కస్టమర్లు రెండు పరికరాల్లో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. కాగా ఇప్పటికే అందిస్తున్న ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌లో ఒక మొబైల్ డివైజ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.
కాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌ను కోరుకునేవారికి రూ.1029 ప్లాన్ చక్కటి ఆఫర్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత మెసేజులు పొందొచ్చు. ప్రతి రోజు 2 జీబీల హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అంతేకాదు కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.
కాగా జులై నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. జియోతో పాటు ఎయిర్టెల్, వీఐ (వొడా ఐడియా) కూడా టారీఫ్ రేట్లను పెంచాయి. దీంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీంతో కస్టమర్లను నిలుపుదల చేసుకోవడంలో భాగంగా ప్రభుత్వ టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లను ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.