Suryakumar Yadav: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తారా?.. సూర్యకుమార్ యాదవ్ సమాధానం ఇదే

Suryakumar Yadav responded on query on IPL captaincy ambitions on a lighter note
  • ఇబ్బందికరమైన పరిస్థితిని కలగజేస్తున్నారంటూ నవ్వుతూ సూర్య సమాధానం
  • ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్య
  • బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఐపీఎల్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా చాలా కాలంగా కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మను పక్కన పెట్టడం, ఆ స్థానంలో హార్ధిక్ పాండ్యాను నియమించిన పరిణామాల నేపథ్యంలో.. వచ్చే సీజన్‌లో సూర్య మరింత కీలక ఆటగాడిగా మారబోతున్నాడని విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరోవైపు ఐపీఎల్ మెగా వేలం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో కూడా నాయకత్వం వహించే ఉద్దేశం ఏమైనా ఉందా? అని సూర్యను మీడియా ప్రశ్నించగా  ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

ఇబ్బందికరమైన పరిస్థితిని కలగజేస్తున్నారంటూ నవ్వుతూ సూర్య సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం భారత కెప్టెన్‌గా ఆనందంగా ఉన్నానని చెప్పాడు. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు నాకు తోచిన సలహాలు ఇచ్చేవాడిని. భారత జట్టుగా కెప్టెన్సీ విషయంలో సంతోషంగా ఉన్నాను. శ్రీలంకతో పాటు గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై కూడా కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఇతర కెప్టెన్ల నుంచి నేర్చుకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని సూర్య సమాధానం ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) మీడియాతో సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా సూర్య కుమార్ యాదవ్ అసలే స్టార్ ప్లేయర్.. ఇక టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో అతడు మరింత హాట్ ప్లేయర్‌గా మారాడు. మరి సూర్య విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Suryakumar Yadav
Cricket
Team India
Mumbai Indians

More Telugu News