Girl Murder: పుంగనూరులో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Police busted girl murder case in Punganuru
  • పుంగనూరులో బాలిక అదృశ్యం
  • సమ్మర్ స్టోరేజి ట్యాంకులో శవమై తేలిన వైనం
  • మూడ్రోజుల్లోనే ఛేదించిన పోలీసులు
  • బాలిక తండ్రి వద్ద అప్పు తీసుకున్న మహిళే ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తింపు
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించగా... ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన మూడు రోజుల్లోనే ఛేదించారు. రూ.3 లక్షల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. ఈ కేసులో రేష్మ, ఆమె తల్లి హసీనా, మైనర్ బాలుడు అఖీల్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

చిన్నారి బాలిక తండ్రి... రేష్మ అనే మహిళకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో తిట్టడంతో పాటు బెదిరించాడు. కోర్టుకు లాగుతానని హెచ్చరించాడు. దాంతో, రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. 

అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి, సమ్మర్ స్టోరేజి ట్యాంకులో పడేశారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని... ఆమెను ముక్కు, నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. 

జిల్లా కలెక్టర్ సుమీత్ స్పందిస్తూ... కానీ కొన్ని చానళ్లు బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు, హోంమంత్రి అనిత స్పందిస్తూ... చిన్నారి బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు.
Girl Murder
Punganuru
Police
Chittoor District

More Telugu News