T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్: చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన టీమిండియా అమ్మాయిలు
- దుబాయ్ లో టీమిండియా × పాకిస్థాన్
- 6 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి
- రాణించిన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి
యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలై... సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న భారత అమ్మాయిలు... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అదరగొట్టారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అన్ని రంగాల్లో అధిపత్యం కనబర్చుతూ, 6 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్-ఏ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేసింది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 3 వికెట్లతో రాణించింది.
ఇక, 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు 18.5 ఓవర్లలోనే ఛేదించింది. 4 వికెట్లకు 108 పరుగులు చేసి విజయభేరి మోగించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29, జెమీమా రోడ్రిగ్స్ 23 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. నాకౌట్ దశకు చేరాలంటే గ్రూప్ దశలో మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ లను శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడం సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపింది.