Revanth Reddy: మన ఆడబిడ్డలకు అన్ని నదుల పేర్లు పెట్టుకుంటాం... మూసీ నది పేరు ఎందుకు పెట్టరు?: సీఎం రేవంత్ రెడ్డి
- మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి
- మూసీ కంపు కొడుతోంది కాబట్టే ఆ పేరు ఎవరూ పెట్టుకోరని వెల్లడి
- మూసీని అద్భుతంగా తీర్చిదిద్దితే తప్పకుండా ఆ పేరు పెట్టుకుంటారని ధీమా
మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. కృష్ణా, గోదావరి, యమున, గంగ, కావేరి, సరస్వతి... ఇలా అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటామని, కానీ మూసీ నది పేరు మీద మాత్రం ఎవరూ పేరు పెట్టుకోరని వెల్లడించారు.
పవిత్రమైన ఇతర నదుల పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్నప్పుడు... ఏ తండ్రి అయినా తన బిడ్డకు మూసీ అనే పేరు పెట్టగలడా? అని ప్రశ్నించారు. ఆ మూసీ నది కంపు కొడుతోంది కాబట్టి ఎవరూ ఆ పేరు పెట్టుకోరని రేవంత్ రెడ్డి వివరించారు.
మూసీ మురిగిపోయింది కాబట్టి, మూసీ విషంతో నిండిపోయింది కాబట్టి... ఈ పేరును పెట్టుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు అని తెలిపారు. అందుకే మూసీ నది మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గంగా, యమున, సరస్వతి నదుల మాదిరిగా మూసీ నదిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన... తల్లిదండ్రులు తప్పకుండా తమ బిడ్డలకు మూసీ అని పేరు పెట్టుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు.