Preity Zinta: డుప్లెసిస్ చలువతో మొత్తానికి టీ20 ట్రోఫీని సొంతం చేసుకున్న ప్రీతిజింటా.. వీడియో ఇదిగో!
- ఐపీఎల్‌లో 17 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూపులు
- సీపీఎల్‌లో ట్రోఫీ సాధించిన ప్రీతి జట్టు సెయింట్ లూసియా కింగ్స్
- ఫైనల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం
బాలీవుడ్ నటిగానే కాదు.. క్రికెట్ ప్రేమికురాలిగా, ఐపీఎల్‌లో ఓ జట్టుకు యజమానిగా ప్రీతిజింటా పేరు అందరికీ సుపరిచితమే. 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభంలోనే ఆమె టీ20 లీగ్ ఫ్రాంచైజీగా ఉన్నారు. మాజీ భర్త నెస్‌వాడియా, మోహిత్ బర్మన్‌తో కలిసి ఆమె పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టును కొనుగోలు చేశారు. 17 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిన వేళ తాజాగా ఓ టీ20 ట్రోఫీని ప్రీతిజింటా జట్టు అందుకుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు ప్రీతి సహ యజమానిగా ఉన్నారు. ఐపీఎల్‌లో నెరవేరని ఆమె కలను ఈ జట్టు నెరవేర్చింది. తాజాగా ఈ జట్టు సీపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. గయానా అమెజాన్ వారియర్స్ జట్టుతో జరిగిన ఫైనల్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.
ప్రీతిజింటా, నెస్‌వాడియా, మోహిత్ బర్మన్‌కు ఇదే తొలి టీ20 ఫ్రాంచైజీ లీగ్ టైటిల్. 2014 ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరి ఆశలు చిగురింపజేసినా గౌతం గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. సీపీఎల్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు.
గయానా అమెజాన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా విజయం సాధించడంలో అరోన్ జోన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. లూసియా బౌలర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి గయానా బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సెయింట్ లూసియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, రోస్టన్ చేజ్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు, డుప్లెసిస్ 21 పరుగులు చేశాడు.