Honey Trapping Case: విశాఖ హనీట్రాప్ కేసులో పోలీసుల దూకుడు
- అందమైన యువతుల ఫొటోలతో యువకులకు వల
- సామాజిక మాధ్యమాల ద్వారా వారిని తమ ఉచ్చులో చిక్కుకునేలా ప్లాన్
- బాధితులకు డ్రగ్స్ ఇచ్చి, యువతులు వారితో సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసిన వైనం
- ఆ తర్వాత వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు
విశాఖపట్నం హనీట్రాప్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్రమంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అందమైన యువతుల ఫొటోలతో యువకులను ఆకర్షించి, సామాజిక మాధ్యమాల ద్వారా వారిని తమ ఉచ్చులో చిక్కుకునేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు మాదక ద్రవ్యాలు ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్న తర్వాత యువతులు సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసేవారు.
అంతే.. ఆ తర్వాత ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం చేశారు. తద్వారా వారి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తమ ప్రైవేట్ ఫొటోలు బయటకు వస్తే పరువుపోతుందన్న భయంతో బాధితులు ఆన్లైన్ ద్వారా భారీగా డబ్బులు సమర్పించుకున్నారు.
ఈ వ్యవహారంలో చాలా మంది యువకులు చిక్కుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆన్లైన్ లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. వారి నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.