Peddireddy Ramachandra Reddy: 'బాబు' సర్కార్ తీరుపై 'పెద్దిరెడ్డి' ఆసక్తికర వ్యాఖ్యలు
- పుంగనూరులో చిన్నారి మృతి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేసిందన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ప్రభుత్వం స్పందించిన తీరుతోనే జగన్ తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారని వెల్లడి
- కర్నూలు ఘటనలోనూ ఇలానే వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్న పెద్దిరెడ్డి
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి ఆశ్వియ అంజామ్ మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భావించారు. ఈ క్రమంలో జగన్ పుంగనూరు టూర్ ఫోగ్రామ్ ఫిక్స్ అయినట్లుగా ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జగన్ పర్యటన రద్దయింది.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అశ్వియ అంజామ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించారని, నిందితులు అరెస్టు అయ్యేలా చూశారని చెప్పారు. అందుకే తమ అధినేత జగన్మోహనరెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. తమ నేత పర్యటిస్తున్నారని తెలిసే ప్రభుత్వం పుంగనూరు ఘటనపై వేగంగా స్పందించిందన్నారు. కర్నూలులో జరిగిన ఘటనలోనూ ఈ విధంగా ప్రభుత్వం స్పందించి ఉంటే బాగుండేదన్నారు.