Sandeep Reddy Bandla: 'జనక అయితే గనక' కథను నాగచైతన్య అందుకే ఒప్పుకోలేదట!
- జనక అయితే గనక యూనివర్శల్ కథ అంటోన్న సందీప్ రెడ్డి
- సుహాస్ పేరును సజెస్ట్ చేసిన దిల్‌రాజు
- గ్లిజరిన్ లేకుండానే సుహాస్ కళ్లు చెమర్చాయన్న దర్శకుడు
ప్రస్తుతం సమాజంలో ఓ మధ్యతరగతి వ్యక్తి తండ్రి కావడానికి ఏ విధంగా ఆలోచిస్తాడు? అలాంటి వ్యక్తి తండ్రి అయితే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి అనే కథాంశంతో రూపొందిన చిత్రమే 'జనక అయితే గనక'. కొడుకును పెంచే స్తోమత తనకు లేదని భావించే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కథతో రూపొందిన ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ వున్నాయి. సుహాస్, సంగీర్తన జంటగా రూపొందిన చిత్రం జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.
ఈ చిత్రం ద్వారా సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. "మొదట్లో ఈ చిత్రాన్ని హీరో నాగచైతన్యతో చేద్దామని అనుకున్నాను. ఆయనతో కొంతకాలం జర్నీ కూడా చేశాను. ఈ సమయంలో ఆయనకు శేఖర్ కమ్ములతో లవ్‌స్టోరీ చిత్రం ఓకే కావడంతో బిజీ అయిపోయారు.
అందుకే నాగచైతన్య ఈ సినిమా చేయలేకపోయారు. అప్పుడు నిర్మాత రాజు సుహాస్‌ను సజెస్ట్ చేయడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇటీవల ఈ చిత్రం ప్రివ్యూను కొన్ని చోట్ల ప్రదర్శించాం. అందరి దగ్గరి నుంచి మంచి స్పందన వచ్చింది. యూనివర్శల్‌గా అందరూ కనెక్ట్ అయ్యే కథతో చేసిన సినిమా ఇది' అన్నారు సందీప్ రెడ్డి.
సినిమాలోని మరికొన్ని విశేషాలు తెలియజేస్తూ 'ఈ కథను దిల్‌రాజు ఓకే చేసినప్పుడు నేను సర్‌ఫ్రైజ్ అయ్యాను. ఆయన ఇలాంటి కథను ఒప్పుకుంటారని అనుకోలేదు. ఇది తెలుగులో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా. తెలుగులో ఎప్పుడూ ఇలాంటి సినిమా రాలేదు. ఇలాంటి కొత్త కథను తప్పకుండా తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం వుంది.
ఎందుకంటే మా గురువు ప్రశాంత్ నీల్ చెప్పినట్లుగా తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ విజయాన్ని అందిస్తారని నమ్మకం వుంది. కొంత మంది అంటున్నట్లుగా ఈ సినిమాలో ఎలాంటి అడల్డ్ కంటెంట్ లేదు. మన కుటుంబంలో అందరూ డిస్కస్ చేసే అంశాన్ని ఇందులో చర్చించాం. నేను ప్రశాంత్ నీల్ దగ్గర పెద్ద కథలకు పనిచేశాను. ఆయన దగ్గర పనిచేసినప్పుడు రచయితగా అన్ని రకాల ఎమోషన్స్ రాశాను. కానీ నాకు అన్ని జోనర్ కథలతో సినిమాలు చేయాలని వుంది.
ముఖ్యంగా రూటెడ్ ఎమోషన్స్‌తో కథలు చెప్పడమంటే చాలా ఇష్టం. అందుకే ఈ కథను ఎంచుకున్నాను. ఈ సినిమా షూటింగ్‌లో వున్నప్పుడే సుహాస్‌కు బాబు పుట్టాడు. అందుకే ఆయన ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో గ్లిజరిన్ అవసరం లేకుండానే ఆయన కళ్లు చెమర్చాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది' అని తెలిపారు.