Judicial Commission: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్
- ఇవాళ సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
- ఏక సభ్య కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయం
ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ తాజాగా ప్రభుత్వానికి కీలక సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఎస్సీ రిజర్వ్ డ్ కులాలను వర్గీకరించడంపై అధ్యయనం చేసేందుకు ఏక సభ్య జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ కు సూచించనుంది.
రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నేడు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ సబ్ కమిటీ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమైంది. 2011 జన గణన డేటాను ఉపయోగించుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలని ఈ సబ్ కమిటీ తీర్మానించింది.
ఈ క్రమంలో, సుప్రీంకోర్టు లేదా, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏక సభ్య జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించాలని నేటి సమావేశంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కులాల్లో అంతర్గతంగా వెనుకబడి ఉన్న కులాలు ఏవో గుర్తించేందుకు ఈ కమిషన్ తో అధ్యయనం చేయించాలని భావిస్తోంది.