Mallu Bhatti Vikramarka: ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం: డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
- కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పోరాటం జరిగిందన్న డిప్యూటీ సీఎం
- గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోలేదని విమర్శ
- మా ప్రభుత్వం రాగానే టీచర్లకు పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని వెల్లడి
ప్రతిపక్షం డీఎస్సీపై ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పోరాటం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఏళ్ల తరబడి పదోన్నతులు, బదిలీలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే టీచర్లకు పదోన్నతులు, బదిలీలు పూర్తి చేసిందన్నారు. డీఎస్సీపై ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా ఆగలేదన్నారు.