Congress: హర్యానాలో బీజేపీ గెలుపు... కాంగ్రెస్, ఠాక్రే శివసేన మధ్య మాటల యుద్ధం

War of words between congress and Shiv Sena UBT over Haryana results
  • ఒంటరి పోరులో గెలుస్తామని కాంగ్రెస్ భావించిందన్న సంజయ్ రౌత్
  • పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్య
  • కూటమిలో ఉన్నప్పుడు విమర్శలు సరికాదన్న కాంగ్రెస్ నేత నానాపటోలే 
హర్యానాలో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఇండియా కూటమిలో మాటల యుద్ధం సాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శలు చేయగా, కాంగ్రెస్ నేత నానాపటోలే కౌంటర్ ఇచ్చారు. 

హర్యానాలో ఇండియా కూటమి విజయం సాధించలేకపోయిందన్నారు. ఒంటరిపోరులో తాము గెలుస్తామని కాంగ్రెస్ భావించిందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లేక సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీ పోరాడిన తీరు బాగుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుస్తుందని భావించారని, కానీ అలా జరగలేదన్నారు.

చాలా సులభమైన పోటీలో బీజేపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. తగిన వ్యవస్థ ఉండటం వల్ల బీజేపీ గెలిచిందన్నారు. కానీ మహారాష్ట్రలో మాత్రం అలా జరగబోదన్నారు. కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏమీ జరగదని కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుంటే మోదీ మూడోసారి ప్రధాని కూడా కాకపోయి ఉండేవారన్నారు.

సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానాపటోలే తీవ్రంగా స్పందించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక కూటమిలో ఉన్నప్పుడు అందులోని పార్టీల నేతలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. మహారాష్ట్ర, హర్యానాలోని పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. మహారాష్ట్రలో మరింత మెరుగ్గా పని చేస్తామని, రౌత్ ప్రకటనకు ఆధారం ఏమిటో తెలియదన్నారు. కానీ భాగస్వామ్య పార్టీలపై నిందలు సరికాదన్నారు.
Congress
Haryana
BJP
Shiv Sena (UBT)

More Telugu News