Kollu Ravindra: మద్యం షాపుల్లో సిండికేట్లను ఉపేక్షించం: కొల్లు రవీంద్ర
- దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడొద్దన్న కొల్లు రవీంద్ర
- రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని హెచ్చరిక
- మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశం
ఏపీలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్, ఆఫ్ లైన్లో షాపులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 16 నాటికి కొత్త వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. మరోవైపు, షాపులను సొంతం చేసుకోవడానికి సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతరులు టెండర్లు వేయకుండా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా షాపులను కేటాయించాలని చెప్పారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలని అన్నారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారికి అధికారులు సహకరించాలని చెప్పారు.