India vs Bangladesh: అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి.. బంగ్లాదేశ్‌పై భారత్‌ రికార్డు విజయం

India 86 run win in the second T20I to seal the T20I series against Bangladesh
  • రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
  • 2-0 తేడాతో సిరీస్ సొంతం
  • 74 పరుగులు చేసి, 2 వికెట్లు తీసిన నితీష్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటడంతో ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన రెండవ టీ20లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. నితీష్ కేవలం 34 బంతుల్లో ఏకంగా 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు బాదడంతో ప్రత్యర్థి బంగ్లాకు భారత్ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ ఏకంగా 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. పరుగుల వ్యత్యాసం పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

భారత బౌలర్లలో నితీష్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 16, లిట్టన్ దాస్ 164, నజ్ముల్ హొస్సేన్ శాంటో 11, తౌహిద్ హృదయ్ 2, మహ్మదుల్లా 41, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్ 16, జాకర్ అలీ 1, రిషద్ హుస్సేన్ 9, తంజిమ్ హసన్ సకీబ్ 8, తస్కిన్ అహ్మద్ 5 (నాటౌట్), ముస్తాఫిజుర్ రహ్మాన్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

అంతకుముందు భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, నితీష్ రెడ్డి 74, హార్దిక్ పాండ్యా 32, రియాన్ పరాగ్ 15, రింకూ సింగ్ 53, వాషింగ్టన్ సుందర్ 0, వరుణ్ చక్రవర్తి 0, అర్ష్‌దీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ అత్యధికంగా 3 వికెట్లు తీయగా.. తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకీబ్, ముస్తాఫీజుర్ తలో రెండేసి వికెట్లు తీశారు. 74 పరుగులు బాదడంతో పాటు 2 కీలకమైన వికెట్లు తీసిన నితీష్ కుమార్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
India vs Bangladesh
Cricket
Team India
Nitish Kumar Reddy

More Telugu News