Ratan Tata: వ్యాపార దిగ్గ‌జం ర‌త‌న్ టాటా మృతిపై క్రీడా లోకం సంతాపం

From Rohit Sharma To Neeraj Chopra Sports Stars Pay Tributes to Ratan Tata
  • బంగారు హృదయం క‌లిగిన‌ వ్యక్తి అన్న రోహిత్‌
  • ర‌త‌న్ టాటా ఈ జాతి మొత్తానికి స్ఫూర్తినిచ్చారన్న నీర‌జ్ చోప్రా
  • దయాగుణానికి ర‌త‌న్ టాటా ప్రతిరూపమ‌న్న సూర్య‌కుమార్‌
ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త, మాన‌వ‌తా‌వాది ర‌త‌న్ టాటా మృతితో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దాతృత్వంతో పాటు వివిధ రంగాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్ చోప్రా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ సహా ఇత‌ర క్రీడాకారులు రతన్ టాటాకు సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.

"బంగారు హృదయం క‌లిగిన‌ వ్యక్తి. ఎంద‌రికో స్ఫూర్తిగా జీవించిన వ్యక్తిగా మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు సార్" అని భారత వన్డే మరియు టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

"శ్రీ రతన్ టాటాజీ మరణ‌వార్త విని షాక‌య్యా. చాలా బాధ‌గా ఉంది. చాలా దూరదృష్టి గల వ్య‌క్తి. ఆయ‌న‌తో జరిపిన సంభాషణల‌ను నేను ఎప్పటికీ మరచిపోలేను. ర‌త‌న్ టాటా ఈ జాతి మొత్తానికి స్ఫూర్తినిచ్చారు. ఆయ‌న‌ను అభిమానించే వారంద‌రికీ బలం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’ అని నీరజ్ చోప్రా రాసుకొచ్చాడు.

"ఒక శకం ముగిసింది. దయాగుణానికి ర‌త‌న్ టాటా ప్రతిరూపం. ఆయ‌న జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం" అని సూర్యకుమార్ అన్నాడు.

"శ్రీ రతన్ టాటాజీని మనం కోల్పోవ‌డం చాలా బాధాక‌రం. ఆయ‌న‌ జీవితం మనందరికీ స్ఫూర్తిగా ఉంటుంది. ఆయన ఎప్ప‌టికీ మ‌న‌ హృదయాలలో జీవించే ఉంటారు. ఓం శాంతి" అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

"మన దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరైన శ్రీ రతన్ టాటాజీ మరణించారు. మన దేశానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి అపురూపమైన రోల్ మోడల్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి" అని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ రాసుకొచ్చాడు. 

"శ్రీ రతన్ టాటాజీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయ‌న‌ కేవలం వ్యాపార నాయకుడు మాత్రమే కాదు, లక్షలాది మందికి నిజమైన స్ఫూర్తి. భారతదేశ అభివృద్ధిపై ఆయ‌న‌ అంకితభావం, సమగ్రత, ప్రభావం సాటిలేనివి. మ‌నం ఒక దిగ్గజాన్ని కోల్పోయాం. కానీ ర‌త‌న్ టాటా వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
Ratan Tata
Rohit Sharma
Neeraj Chopra

More Telugu News