Ratan Tata: ముంబయిలో అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు... హాజరైన అమిత్ షా
- గత రాత్రి తుదిశ్వాస విడిచిన రతన్ టాటా
- యావత్ దేశం విచారానికి గురైన వైనం
- ఎన్సీపీఏ నుంచి వర్లి శ్మశానవాటిక వరకు ఘనంగా అంతిమయాత్ర
భారతదేశ వ్యాపార, పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు. అందుకే రతన్ టాటా మృతితో యావత్ దేశం విచారంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో సకల ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మహారాష్ట్ర పోలీసులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటాకు కడసారి నివాళులు అర్పించారు. ముంబయిలోని ఎన్సీపీఏ నుంచి వర్లి శ్మశాన వాటిక వరకు ఈ సాయంత్రం ఆయన అంతిమయాత్ర ఘనంగా సాగింది.