Congress: హర్యానాలో అందుకే ఓడాం.. ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష
- పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష
- ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలే కొంప ముంచాయని నిర్ధారణ
- త్వరలోనే నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయం
పార్టీ నేతల్లో ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం, తిరుగుబాటు వంటి కారణాలే హర్యానాలో పార్టీ ఓటమికి కారణాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిన్న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లోట్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఏఐసీసీ హర్యానా వ్యవహారాల ఇన్చార్జ్ దీపక్ బాబరియా వర్చువల్గా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిందన్న దానిపై వాస్తవాలు వెలికితీసేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఎదురైన సమస్యలను ఈ సందర్భంగా తెలుసుకుంటారు. పార్టీ అభ్యర్థులందరి అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.