Shilpa Shetty: శిల్పా శెట్టి, ఆమె భర్తకు బాంబే హైకోర్టులో ఊరట

Shilpa Shetty and Raj Kundra gets relief in Bombay High Court
  • 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'లో శిల్పా శెట్టి దంపతుల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • ఈ నెల 13 లోగా ఇల్లు, ఫామ్ హౌస్ ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు
  • ఈడీ నోటీసులపై స్టే విధించిన బాంబే హైకోర్టు
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను ఈ నెల 13వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులను ఇటీవల శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే విధించింది. 

కోర్టులో వాదనల సందర్భంగా శిల్పా శెట్టి తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... 2017లో జరిగిన 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇది ఈడీ పరిధిలో లేని అంశమని... అయినప్పటికీ ఈ కేసులో నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు వారు ఈడీ విచారణకు సహకరిస్తారని తెలిపారు. 

కేసు వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన 'వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ 2017లో 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'ను నిర్వహించింది. బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ విధానంలో ఢిల్లీ, ముంబైలో రూ. 6,600 కోట్లను వసూలు చేసింది. ఈ సంస్థ మోసం బయటపడటంతో దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 

ఈ స్కీమ్ లో మాస్టర్ మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను కొనుగోలు చేశారని... ఇప్పటికీ అవి ఆయన వద్దే ఉన్నాయని ఈడీ తెలిపింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి దంపతులకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Shilpa Shetty
Raj Kundra
Bombay High Court
Enforcement Directorate

More Telugu News