Nara Lokesh: కియా షోరూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పెట్టుబడులను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్న మంత్రి
- ఏపీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసలు
- జగన్ జిల్లాల పర్యటనకు వెళితే చట్ట ప్రకారం అనుమతి ఇస్తామని వెల్లడి
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను మంత్రి నారా లోకేశ్ ఇవాళ (శుక్రవారం) ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో పక్క రాష్ట్రాలతో ఏపీ పోటీ పడాలని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని, పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామన్న వారందరినీ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
టీసీఎస్, లులూ, రిలయన్స్ వంటి కంపెనీలు ప్రస్తుతం ఏపీ వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. దానికి కారణం మన బ్రాండ్ అంబాసిడర్, ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు అని లోకేశ్ పేర్కొన్నారు. ఎక్కడి వెళ్లినా చంద్రబాబు నాయుడి రాష్ట్రం అంటున్నారని, ఆయనపై ఉన్న విశ్వసనీయత, నమ్మకం వల్లే రాష్ట్రంలోకి తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు.
భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ కనిపించే కియా కార్లు ‘మేడిన్ ఆంధ్రప్రదేశ్’ కావడం గర్వించదగ్గ విషయమని లోకేశ్ వివరించారు.
రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు
రాజధాని ప్రాంతంలో ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని మంత్రి నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సేవల రంగానికి చెందిన కంపెనీలను ఉత్తరాంధ్రకు తీసుకొస్తామని ఆయన అన్నారు. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమల నెలకొల్పుతామని అన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రో కెమికల్స్ సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జగన్ జిల్లాల పర్యటనకు అనుమతి ఇస్తాం
మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వెళితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక రెడ్‌బుక్‌లో పేరు ఉందంటూ వైసీపీ నాయకులు వణికిపోతున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్ర సమయంలో చెప్పినట్టుగానే భూకబ్జాలకు పాల్పడిన వారిపై, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. అలాంటి వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ప్రచారం చేసేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ ప్రచారం చేసేవారిపై చర్యల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదని అన్నారు.