Harish Rao: ఏపీకి నిధులు.. తెలంగాణకు గుండు సున్నా: కేంద్రంపై హరీశ్ ఫైర్
- గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ. 100 కోట్లు ఇచ్చారన్న హరీశ్
- కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధుల కింద రూ. 15 వేల కోట్లు ఇచ్చారని వ్యాఖ్య
- తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపాటు
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుండు సున్నా ఇచ్చిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి కేంద్రం రూ. 100 కోట్ల నిధులు ఇచ్చిందని... తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా... తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది సున్నా అని... ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కింద రూ. 15 వేల కోట్లు మంజూరయ్యాయని వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో బీఆర్ఎస్ బలమైన స్థానంలో ఉండి ఉంటే.. ఈ అన్యాయాన్ని తాము జరగనిచ్చే వాళ్లం కాదని అన్నారు. మరోసారి తెలంగాణను పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు. ఈ పక్షపాత ధోరణి ఎందుకని అడిగారు. ఇతర రాష్ట్రాలతో సమాన వాటాను తెలంగాణ డిమాండ్ చేస్తోందని చెప్పారు.