Nadendla Manohar: విజయవాడలో రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల
- గురునానక్ కాలనీ, పంట కాలువ రోడ్ లో రైతు బజార్లను సందర్శించిన నాదెండ్ల
- నాణ్యతలేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని స్పష్టీకరణ
- వినియోగదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు విజయవాడలోని రైతుబజార్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురునానక్ కాలనీ, పంట కాలువ రోడ్ లో ఉన్న రైతు బజార్లలో ప్రజలకు విక్రయించే సరకుల నాణ్యత, ధరలపై స్వయంగా పరిశీలన చేపట్టారు. నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కి, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఆ మేరకు రైతు బజార్ లలోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయించారు.
ఇక, ప్రతి రేషన్ కార్డుపై రిఫైన్డ్ ఆయిల్‌ను గరిష్ఠంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో... రాష్ట్రంలోని కోటి 49 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుంది.