Chandrababu: విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
- రేపు దసరా పండుగ
- సోషల్ మీడియా ద్వారా స్పందించిన సీఎం చంద్రబాబు
- ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కనకదుర్గమ్మను వేడుకుంటున్నట్టు వెల్లడి
రేపు (అక్టోబరు 12) దసరా పండుగను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నానని తెలిపారు.
"చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ నిర్వహించుకుంటాం. ఈ పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామని తెలిపారు.
మరోవైపు, ఆ దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని వెల్లడించారు. ఇదే ఒరవడితో సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరొక్కమారు అందరికీ మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు.