Tamil Nadu: తమిళనాడులో గూడ్స్ రైలును ఢీకొట్టిన దర్భంగా ఎక్స్‌ప్రెస్
- తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధం
- ఏసీ కోచ్‌లలోని 19 మందికి గాయాలు
తమిళనాడులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళుతుంది.
ఈ ప్రమాదంలో దర్భంగాలోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదరుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి ఒకటి ఎక్కాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది, స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్న సమయంలో ముందు ఉన్న కోచ్‌లు అన్నీ ఏసీవే. ఈ కోచ్‌లలోని 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.