india bangladesh 3rd t20: నేడు టీమిండియా-బంగ్లాదేశ్ చివరి టీ20... ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు
- బంగ్లాదేశ్‌పై మూడో టీ 20లోనూ గెలుపొంది క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధమవుతున్న టీమిండియా
- ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకునే ప్రయత్నంలో తలపడనున్న బంగ్లా టీమ్
- ఉప్పల్ స్టేడియం వద్ద మొత్తం 2600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడి
ఉప్పల్ (హైదరాబాద్) స్టేడియంలో ఈరోజు భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు టీ 20ల్లో గెలుపొంది ఆధిక్యంలో ఉన్న టీమిండియా జట్టు ..మూడో టీ 20 మ్యాచ్ కు సిద్దమైంది. ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న కృతనిశ్చయంతో భారత్ టీమ్ ఉంది. మరో వైపు .. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న రెండు టీమ్‌లు నిన్న ఉప్పల్ క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేశాయి.
కాగా, భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ 20 మ్యాచ్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రీడా మైదానం వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. అంతే కాకుండా.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్ఎస్పీ, ఆరు ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తులో ఉన్నాయి. అలానే పది వజ్రా వెహికల్స్, 2 అక్టోపస్ బృందాలు, పది మౌంటెడ్ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తెలిపారు. 300 సీసీ కెమెరాలతో పర్యవేక్షణతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశామని సీపీ వెల్లడించారు.