AR Rahman: కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహ్మాన్ ప్రచారం

AR Rahman has recorded a 30 minute performance video to support Kamala Harris in her presidential campaign
  • 30 నిమిషాల ప్రదర్శనను రికార్డ్ చేసిన ఆస్కార్ అవార్డు విన్నర్
  • రేపు యూట్యూట్ వేదికగా విడుదల కానున్న వీడియో
  • హిట్ సినిమా పాటలతో హారిస్‌కు మద్దతుగా సందేశాలు రూపొందించిన ఏఆర్ రెహ్మాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు మద్దతుగా భారతీయ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ రంగంలోకి దిగారు. హారిస్‌కు మద్దతుగా 30 నిమిషాల ప్రదర్శన వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా ఆయన నిలిచారు. ఏఆర్ రెహ్మాన్ మద్దతుతో నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. 

అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడిన నాయకులు, కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా ఏఆర్ రెహ్మాన్ తన స్వరాన్ని కలిపినట్టు అయిందని ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) విక్టరీ ఫండ్ చైర్‌పర్సన్ శేఖర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఏఆర్ రెహ్మాన్ వీడియో రికార్డింగ్‌పై మాట్లాడుతూ... ‘‘ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన సంగీత కార్యక్రమం మాత్రమే కాదు. మనం చూడాలనుకుంటున్న అమెరికా కోసం మన సమూహాలు ఓటు వేయాలని పిలుపు’’ అని నరసింహన్ అన్నారు.

కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఆర్ రెహ్మాన్ రూపొందించిన 3 నిమిషాల వీడియోను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఏఏపీఐ విక్టరీ ఫండ్ యూట్యూట్ ఛానల్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏఆర్ రెహ్మాన్ హిట్ సినిమా పాటలతో హారిస్‌కు మద్దతుగా రూపొందించిన సందేశాలు ఇందులో ఉండనున్నాయి.

కాగా ఏఏపీఐ విక్టరీ ఫండ్ అనేది ఒక రాజకీయ కమిటీ. అర్హులైన ఆసియన్ అమెరికన్లు, హవాయిలు ఓటు వేసేలా ఈ కమిటీ ప్రోత్సహిస్తుంది. ఇక కమలా హారిస్ గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా, మొట్టమొదటి నల్లజాతి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోనున్నారు.
AR Rahman
Kamala Harris
US Presidential Polls
USA

More Telugu News