Balakrishna: అల్లు అరవింద్ కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే నో చెప్పేవాడ్ని: బాలకృష్ణ

Balakrishna said he is doing Unstoppable Talk Show only after Allu Aravind insisted
  • మూడు సీజన్ల పాటు విజయవంతమైన అన్ స్టాపబుల్ టాక్ షో
  • త్వరలో నాలుగో సీజన్
  • దసరా వేళ ట్రైలర్ రిలీజ్
  • హైదరాబాదులో గ్రాండ్ గా ఫంక్షన్
ఓటీటీ రంగంలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఓ సంచలనం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా, ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ టాక్ షో రేటింగ్ మామూలుగా ఉండదు. 

టాక్ షోకి హాజరయ్యేవారిని బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నిస్తూ, వారి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబడుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ ఆడియన్స్ ను గిలిగింతలు పెడుతూ, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడం ఈ ఈ కార్యక్రమానికి ప్లస్ అయింది. 

ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజాగా నాలుగో సీజన్ లోకి ఎంటరవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ టాక్ షో టీమ్ హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ... అల్లు అరవింద్ వల్లే తాను ఈ టాక్ షో చేస్తున్నానని వెల్లడించారు. వాస్తవానికి అల్లు అరవింద్ కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే తాను ఈ షో చేసేవాడ్ని కాదని అన్నారు. ఇతర ప్రోగ్రామ్ లు చేయాలని చాలామంది అడిగారని, వారందరికీ నో చెప్పానని తెలిపారు. 

అన్ స్టాపబుల్ షో సమయంలో తామందరం ఒక కుటుంబంలా కలిసిపోయామని బాలయ్య పేర్కొన్నారు. సమష్టి కృషి ఫలితమే ఈ టాక్ షో విజయవంతం కావడానికి కారణం అని వివరించారు. 

ఇక, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ ఎంతో ప్రశస్తమైన రోజు అని వివరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారిని 9 అవతారాల్లో పూజించుకుంటామని తెలిపారు. 

చెడు మీద మంచి, అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం... ఇలా విజయానికి సూచిక విజయదశమి అని బాలకృష్ణ అభివర్ణించారు. ఏదైనా గట్టిగా ప్రయత్నిస్తే విజయం దక్కుతుందని, అందుకు దసరా శరన్నవరాత్రులే నిదర్శనం అని అన్నారు.
Balakrishna
Unstoppable With NBK
Talk Show
Allu Aravind
Aha
OTT
Tollywood

More Telugu News