Rain Alert: నెల్లూరు జిల్లాకు వాన గండం... కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
- అప్రమత్తమైన నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాకు వాన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
జిల్లా కలెక్టర్ ఆనంద్ దీనిపై స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 0861-2331261, 7995576699, 1077 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
జిల్లాలోని డివిజన్లు, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు.
భారీ వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున... రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పెన్నా నది గట్లను పరిశీలించాలని ఆదేశించారు. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.