AP Rains: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
- చిత్తూరు నుంచి వైజాగ్ వరకు కురుస్తున్న వర్షాలు
- అల్పపీడనం కారణంగా అల్లకల్లోలంగా మారిన సముద్రం
- గురువారం వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఐదు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. మరోవైపు గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్ర తీర ప్రాంతంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచించారు.