KTR: రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నదికి మరణశాసనం రాస్తారా?: కేటీఆర్
- వికారాబాద్ జిల్లాలో రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేటీఆర్
- తమపై ఒత్తిడి చేసినా రాడార్ ఏర్పాటుకు అంగీకరించలేదన్న మాజీ మంత్రి
- రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం
వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఓ వైపు మూసీ నదికి మరణ శాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు అంటారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్ధానమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమపై పదేళ్ల పాటు ఒత్తిడి చేసినప్పటికీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అంగీకరించలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని నిలదీశారు. రాడార్ స్టేషన్కు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు.
జనావాసాలు లేని చోట ఇలాంటి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. దామగుండంలో రాడార్ స్టేషన్ను తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. గంగానదికి ఒక న్యాయం... మూసీకి ఒక న్యాయామా? అని మండిపడ్డారు.