India: కెనడా నుంచి భారత్ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కేంద్రం
- కెనడాలోని దౌత్యవేత్తలకు రక్షణ లేదన్న భారత ప్రభుత్వం
- భద్రత కల్పించే విషయంలో ట్రూడో ప్రభుత్వంపై నమ్మకం లేదన్న భారత్
- హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి పిలిపించిన కేంద్రం
కెనడాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను, అధికారులను వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. కెనడాలోని తమ దౌత్యవేత్తలకు రక్షణ లేదని, అందుకే వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కెనడాలో తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ప్రస్తుత ట్రూడో సర్కార్‌పై తమకు నమ్మకం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకమిషనర్ సహా దౌత్యవేత్తలు వెనక్కి వస్తున్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా పేర్కొంది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత హైకమిషనర్‌ను అనుమానితుడిగా పేర్కొనడంతో భారత్ కూడా తీవ్రంగా స్పందించింది.
భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని కెనడా దౌత్యాధికారికి భారత్ తేల్చి చెప్పింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని తెలిపింది.