Ravichandran Ashwin: ఆర్సీబీకి రోహిత్ శర్మ.. అశ్విన్ ఏం చెప్పాడంటే..!
- తన యూట్యూబ్ ఛానెల్లో అభిమానులతో ముచ్చటించిన అశ్విన్
- ఆర్సీబీకి హిట్‌మ్యాన్ వస్తారా అంటూ అభిమాని ప్రశ్న
- దాని కోసం బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 20కోట్లు పక్కన పెట్టుకోవాలన్న అశ్విన్
ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల రిటెన్షన్‌పై ఒక స్పష్టత వచ్చేసింది. ఆరుగురు ప్లేయర్లను అట్టేపెట్టుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీంతో రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి.
ఇక ఐపీఎల్ మెగా వేలం సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకునే విషయమై కూడా కసరత్తులు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి ఆ ఫ్రాంచైజీని వదలిపెట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో ఆ జట్టు రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించింది. అలాగే గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకున్న హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ ఆ జట్టులో కొనసాగేందుకు సుముఖంగా లేడనే కథనాలు వెలువడ్డాయి.
దీంతో రోహిత్ వేలంలోకి వస్తే భారీ డిమాండ్ ఉండడం ఖాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సహా పలు ఫ్రాంచైజీలు రోహిత్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే జట్టులో ఉండే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయమై అభిమాని అడిగిన ప్రశ్నకు అశ్విన్ స్పందిస్తూ, వేలంలో రోహిత్ కోసం ఆర్సీబీ కనీసం రూ. 20 కోట్లు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
"అగర్ రోహిత్ శర్మ కే లియే ఆప్ జా రహే హైతో బిస్ క్రోర్ రఖ్నా పడేగా (మీరు రోహిత్ శర్మను తీసుకోవాలనుకుంటే రూ. 20 కోట్లు మీ వద్ద ఉంచుకోవాలి)" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో చర్చ సందర్భంగా చెప్పాడు.