Very Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఏపీఎస్డీఎంఏ
- దక్షిణ బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
- రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
- ఈ నెల 17న ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఇది రానున్న 12 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వాయుగుండం గురువారం తెల్లవారుజాముకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అదే సమయంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.