Varla Ramaiah: ఆ మహిళ చెప్పింది విని చంద్రబాబు కళ్లు చెమర్చాయి: వర్ల రామయ్య
- మహిళ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం చంద్రబాబు
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఇల్లు మంజూరు
- ఆమె కుమారుడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం
- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను అందించిన వర్ల రామయ్య
రాష్ట్రంలో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎలాంటి మేలు జరిగిందన్నది వర్ల రామయ్య వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు.
"గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 45 రోజుల క్రితం తన సమస్యలను వివరిస్తూ వినతిపత్రం ఇచ్చింది. ఒంటరి మహిళగా అనేక ఇబ్బందులు పడుతున్నానని, తన కుమారుడికి సరైన జీవనోపాధి లేదని విన్నవించింది. తనకు కిడ్నీల సమస్య ఉందని, ప్రతి 3 నెలలకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. సరైన ఇల్లు కూడా లేదని చాలా ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రికి వివరించింది.
వెంకాయమ్మ సమస్యలు విన్న ముఖ్యమంత్రికి కళ్లు చెమర్చాయి. వెంటనే వెంకాయమ్మ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు వెళ్లాయి. ఈ క్రమంలో... వెంకాయమ్మకు రూ.1.80 లక్షలతో ఇల్లు మంజూరైందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అదేవిధంగా వెంకాయమ్మ కుమారుడు వంశీకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఆఫీస్ సబార్డినేట్ గా ఉద్యోగం ఇస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పడానికి వెంకాయమ్మ కుటుంబానికి చేసిన సాయం ఓ నిదర్శనం" అని వర్ల రామయ్య వివరించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా నడిచే ప్రభుత్వమని.. అరాచకం, అడ్డగోలుతనం, అవినీతికి ఈ పాలనలో చోటు లేదని ఉద్ఘాటించారు. పేదలను, ఆపన్నులను ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల లక్ష్యం ఒక్కటేనని... పేదలకు అండగా నిలవడం అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
"వైసీపీ పాలన ప్రజా కంఠక పాలనగా సాగింది. అందుకే ప్రజలచే ఛీత్కారానికి గురై తరిమి తరిమి కొట్టబడింది" అని వర్ల రామయ్య అన్నారు.
వెంకాయమ్మకు, వంశీకి ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులను టీడీపీ నాయకులతో కలిసి అందించారు. కూటమి ప్రభుత్వం పేదవారికి ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేశ్, నాయకులు ఎస్పీ సాహెబ్, విద్యాసాగర్ పాల్గొన్నారు.