AP Govt: ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట
- రెండు కేసుల్లో ఏబీ వెంకటేశ్వరరావుకు విముక్తి
- కేసులు ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- మరో కేసుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న సీఎం
గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి భారీ ఊరట లభించింది. ఏబీవీపై ఉన్న కేసుల్లో రెండింటిని ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో కేసుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ సర్కార్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న అభియోగంతో జగన్మోహనరెడ్డి సర్కార్ ఆయనను సస్పెండ్ చేసింది. కేసులు నమోదు చేయడంతో పాటు సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలంటూ కూడా కేంద్రానికి సర్కార్ ప్రతిపాదనలు పంపింది. 2019 నుండి ఐదేళ్ల పాటు సస్పెన్షన్లు, కేసులు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కుంటూనే న్యాయపోరాటం చేసిన ఏబీవీ చివరకు పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ దక్కించుకుని మే 31న ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా గౌరవ ప్రదంగా పదవీ విరమణ అయ్యారు.
కాగా, అఖిలభారత సర్వీస్ అధికారుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి పెగాసెస్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారని వైసీపీ సర్కార్ అభియోగాలను నమోదు చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం విచారణ పూర్తి చేయకపోవడంతో ఆ అభియోగాలు వీగిపోయాయి. ఈ క్రమంలో అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన ఆ అభియోగాలను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.