Alhaz Javed R Shroff: ఎన్సీపీ (అజిత్ పవార్)లో చేరిన ముంబై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్జాజ్ జావేద్
- ఎక్స్ వేదికగా చేరిక విషయాన్ని పంచుకున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- అదే సమయంలో పూణెలో అజిత్ వర్గానికి చెందిన 600 మంది కార్యకర్తల రాజీనామా
- గవర్నర్ కోటాలో పూణె నగర అధ్యక్షుడు దీపక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు నిరసనగా నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ పార్టీ ముంబై ప్రధాన కార్యదర్శి అల్హాజ్ జావేద్ ష్రాఫ్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. చేరిక విషయాన్ని అజిత్ పవార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో అజిత్ పవార్ వర్గానికి షాక్ తగిలింది. పూణె నగర అధ్యక్షుడు దీపక్ మన్కర్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వకూడదన్న గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అజిత్ వర్గానికి చెందిన 600 మంది కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు పార్టీకి రాజీనామా చేశారు.
కాగా, హర్యానా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఫలితాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో త్వరలో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌కు జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిన్ననే షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రకు ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికానున్నాయి.