Sajjala Ramakrishna Reddy: నేనేమీ దేశం వదిలి పారిపోలేదు... ఎందుకు నోటీసులతో హడావుడి చేస్తున్నారు?: సజ్జల

Sajjala press meet on police being given notice in TDP Office Attack case
  • టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు
  • ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల
  • టీడీపీ ఆఫీసుపై దాడి ఎందుకు జరిగిందో అందరికీ తెలుసని వెల్లడి
  • నోరుందని అడ్డగాడిదల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • అందరూ పెండ్యాల శ్రీనివాస్ లాగా పారిపోతారా అంటూ వ్యాఖ్యలు
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో లుకౌట్ నోటీసులతో అడ్డుకోవడమే అందుకు నిదర్శనం. తాజాగా, ఈ కేసులో విచారణకు రావాలంటూ మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో, ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. 

తానేమీ దేశం వదిలి పారిపోలేదని, ఎందుకు నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారని అసహనం ప్రదర్శించారు. విదేశాల్లో వారం రోజుల పర్యటన అనంతరం తిరిగొచ్చానని, కానీ నోరుందని అడ్డగాడిదల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

"పారిపోనివ్వం అంటున్నారు... ఇక్కడ ఎవరు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతారు? గతంలో చంద్రబాబు వ్యవహారంలో నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్టు అందరూ పరారవుతారా? తప్పులు చేసిన వాళ్లు కదా పారిపోయేది? మీరు పెట్టింది తప్పుడు కేసు... ఆ విషయం ఎలాగూ న్యాయస్థానంలో నిరూపితమవుతుంది. 

బలవంతం చేసి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినా, చివరికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం. గతంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్రలను అరెస్ట్ చేస్తే గగ్గోలుపెట్టారు. వాళ్లపై వివాదాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టడం జరిగింది. వాళ్లపై వివాదాల మీద విచారణ ప్రక్రియ జరిగింది. 

కానీ ఇక్కడ మీరు చేస్తున్నది ఏమిటి? ఎప్పుడో 2021లో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే అప్పుడే ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఆ ఘటన ఎందుకు జరిగిందనేది ప్రపంచానికంతా తెలుసు. ముఖ్యమంత్రి గారిని మీ (టీడీపీ) నాయకుడు బండబూతులు తిడితే, ఆగ్రహం చెందిన కార్యకర్తలు (వైసీపీ) ధర్నాకు వెళ్లారు. అక్కడ వారిని రెచ్చగొట్టడంతో గొడవ జరిగింది. 

దాన్ని ఆధారంగా చేసుకుని మళ్లీ కేసు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఆ కేసు కూడా ముగిసిపోతున్న సమయానికి నాకు నోటీసులు పంపుతున్నారు... రాష్ట్రంలో ఈ అరాచకానికి హద్దు లేదా? సుప్రీంకోర్టు నా విషయంలో ఇంటెరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చింది... అయినా కూడా నాకు నోటీసులు ఇవ్వడం ఏంటి? దీన్ని బరితెగింపు అనాలా? ఇంకేమనాలి? నటి జెత్వానీ కేసులో కూడా నన్ను ఇదే విధంగా ఇరికించారు. ఏదో రకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేయాలనుకుంటున్నారు. 

మరోవైపు, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. దానర్థం చంద్రబాబు తప్పు చేసినట్టే కదా! కానీ, చంద్రబాబు నిర్దోషి అంటూ రాస్తారు... ఇలా తప్పుడు ప్రచారం చేసి ఎవర్ని నమ్మించాలనుకుంటున్నారు? ప్రజలను నమ్మించినా, న్యాయస్థానాలను నమ్మించలేరు" అంటూ సజ్జల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Sajjala Ramakrishna Reddy
TDP Office Attack case
Notice
Police
YSRCP
TDP

More Telugu News