Ponnam Prabhakar: ఉచిత బస్సు ప్రయాణం స్కీంలో 100 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు!: పొన్నం ప్రభాకర్
- ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో పథకాన్ని అమలులోకి తెచ్చామన్న మంత్రి
- తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని విమర్శ
- ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్న పొన్నం ప్రభాకర్
ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 48 గంటల్లోనే ఈ పథకాన్ని అమలులోకి తెచ్చామన్నారు. గద్వాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చారని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణపై మోపారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ రానివారు స్థానిక కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. రూ.2 లక్షల లోపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
పాలమూరు ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.