Raja Singh: హైదరాబాద్‌లో బీజేపీ కీలక సమావేశం... బండి సంజయ్, రాజాసింగ్ గైర్హాజరు!

Rajasingh and Bandi Sanjay did not attend to party meeting
  • కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం
  • వివిధ కారణాల వల్ల హాజరుకాని పలువురు నేతలు
  • పార్టీ బలోపేతంపై చర్చించామన్న మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు.

కిషన్ రెడ్డి అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.

పార్టీ బలోపేతంపై చర్చించాం: మహేశ్వర్ రెడ్డి

ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సునీల్ బన్సల్ సూచించారన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై కూడా చర్చించామన్నారు. 23, 24 తేదీల్లో మూసీ పరీహవాక ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలోని ప్రజల గోడును వింటామన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
Raja Singh
Bandi Sanjay
Telangana
BJP

More Telugu News