Nara Lokesh: విశాఖలోనూ నారా లోకేశ్ ప్రజా దర్బార్... భారీగా తరలి వచ్చిన ప్రజలు
- సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసు
- విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేశ్
- టీడీపీ ఆఫీసులో లోకేశ్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
- ఓపిగ్గా వినతులు స్వీకరించిన లోకేశ్
మంత్రి నారా లోకేశ్ సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇవాళ విశాఖపట్నం వచ్చారు. ఆయనను కలిసేందుకు ఈ సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ విశాఖ టీడీపీ కార్యాలయంలో వినతుల స్వీకరణ కార్యక్రమం 'ప్రజాదర్బార్' నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు... ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేశ్ ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతగొందిలో గిరిజన కుటుంబానికి చెందిన ఐసరం రత్నాలమ్మ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. ఇటీవల తన భర్త అనారోగ్యానికి గురై మరణించాడని, ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారిందని కన్నీటిపర్యంతమయ్యారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనకు ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మెగా డీఎస్సీలో గిరిజిన ప్రాంత అభ్యర్థులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించి గిరిజన ప్రాంత నిరుద్యోగ ఉపాధ్యాయులుకు న్యాయం చేయాలని పాడేరుకు చెందిన కిల్లు వెంకట రమేశ్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరు శివారులోని మెడిటెక్ ఏఎంటీజడ్ కు 200 మంది రైతుల నుంచి భూములు సేకరించారని, వాటికి పరిహారం చెల్లించడంతో పాటు జోన్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఏ.సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఎస్జీటీ పోస్టులను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో చేర్చాలని ఎస్.ఆలమ్ రాజా, అబ్దుల్ రజాక్ కోరారు.
విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కు కేటాయించిన భూమిని ప్లాట్లుగా విభజించి అర్హులకు కేటాయించాలని స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2015 నుంచి అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల గెస్ట్ అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
ఎంటీఎస్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ వ్యవస్థలో విలీనం చేయాలని ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.